విశాఖ జిల్లాలోని అరకు లోయలో ఘోర రోడ్డు ప్రమాదం


                               

   విహార యాత్రలో అంతులేని విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా.. బస్సు 300 లోయల అడుగులో పడడానికి బదులుగా కొండను ఢీకొని ఆగిపోయే ఉండేదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా అలాంటి ఘాట్‌రోడ్డులో వెళ్లాలి అంటే ఎంతో నైపుణ్యం అవసరం. ఎందుకంటే అరకులోయ ఘాట్‌రోడ్‌లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్‌ పిన్‌ బెండ్‌లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి.. ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అనుభవం ఉన్న డ్రైవర్లు సైతం పూర్తిగా చీకటి పడిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణించాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ అలాంటి రోడ్లపై నైపుణ్యమే లేని డ్రైవర్ బస్సును నడపడం.. అది కూడా రాత్రి వేళ కావడంతో బస్సు ప్రమాదం తీవ్రత పెరిగింది.





విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్‌ రోడ్డు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది. ఘాట్ రోడ్ లో అప్పటి వరకు సరదాగా సాగుతున్న విహార యాత్ర.. డముకు 5వ నంబర్‌ మలుపు దగ్గరకు రాగానే కుదుపునకు గురైంది. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో ఘాట్ రోడ్డుపై వెళ్లాల్సిన బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. 22 మందికి గాయాలు అయ్యాయి.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి సీరియస్ గా ఉన్నవారందరికీ విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు...

Comments